గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు.
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఇటీవల ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని కాగ్ తమ నివేదికలో వేలెత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గుర్తు చేస్తూ.. అదులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా.. అని ఆరా తీశారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ. 3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కో ఆపరేటివ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వటం నిలిపి వేసిందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు.