తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఖమ్మంలో రైతు భరోసా వర్క్ షాప్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొననున్నారు. గురువారం రోజున ఆదిలాబాద్, శుక్రవారం రోజున మహబూబ్‌నగర్, 15వ తేదీన వరంగల్, 16వ తేదీన సంగారెడ్డిలో జిల్లా స్థాయి రైతుభరోసా సదస్సులు జరగనున్నాయి.
ఈనెల 18వ తేదీన నిజామాబాద్, 19న కరీంనగర్,. 22న నల్గొండ, 23వ తేదీన రంగారెడ్డి జిల్లాలో రైతుభరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. వర్క్‌షాప్‌లకు ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించాలని కలెక్టర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ వర్క్‌షాప్‌లో చర్చలు, అభిప్రాయాలు, సూచనలను సదస్సు జరిగిన రెండ్రోజుల్లో నివేదిక రూపంలో కలెక్టర్లు వ్యవసాయ శాఖకు పంపించనున్నారు. రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి అనే విధివిధానాలు, అర్హతలపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుంది. నెలాఖరున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.