తెలంగాణ వ్యాప్తంగా రైతుల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ గురించి చేసిన తాజా ప్రకటన. ఏకంగా రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి చేలల్లో కేసీఆర్ (KCR) అక్షరాలు రాస్తూ ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలోని దూది వెంకటాపురంలో నారుతో కేసీఆర్ అక్షరాలు పేర్చి రైతులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. రైతు రుణమాఫీ ప్రకటించినందుకుగాను బోధ్ మండలం సోనాలలో రైతులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రుణమాఫీ చేసి మరోసారి రైతు బాంధవుడు అని కేసీఆర్ నిరూపించుకున్నారని రైతులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.19 వేలకోట్ల పంట రుణాలు మాఫీ చేశారని ఆనందం వ్యక్తం చేశారు.