రాష్ట్రంలో ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపుతో కలిపి మొత్తం కన్వీనర్ కోటా కింద 81,490 మందికి బీటెక్ సీట్లు దక్కాయి. దీంతో మొత్తం సీట్లలో 94.20 శాతం భర్తీ కాగా.. ఇంకా 5,019 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 2,788 మందికి సీట్లు దక్కాయి. మొత్తం సీట్లలో 6,476 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో దక్కించుకున్నారు. తాజాగా సీట్లు పొందినవారు ఆగస్టు 2వ తేదీ లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
మరోవైపు సీట్ల రద్దుకు ఆగస్టు 7వ తేదీ తుది గడువుగా తెలిపారు. ఆగస్టు 8వ తేదీ నుంచి చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండో విడతలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారూ పోటీ పడొచ్చు. కొత్తగా కూడా స్లాట్ బుక్ చేసుకొని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై సీటు పొందేందుకు ప్రయత్నించవచ్చు. వారికి ఈ నెల 13వ తేదీ నాటికి సీట్లు కేటాయిస్తారు. మూడో విడత తర్వాత ఆగస్టు 16-17 తేదీల్లోనే విద్యార్థులు స్వయంగా కళాశాలలకు వెళ్లి అసలు టీసీతో పాటు ఇతర ధ్రువపత్రాల కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.