ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల రెండో దశ పంపిణీ జరగనుంది. ఈ దశలో 13,300 ఇళ్లను పేదలకు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి దశలో ఇటీవల 11,700 ఇళ్లను విజయవంతంగా పేదలకు ఇచ్చామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తిస్తున్నామని.. మీడియా ముందు కంప్యూటర్ల ద్వారా లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. పైరవీకారులకు, అనర్హులకు లబ్ధిదారుల్లో చోటు లేదని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉండదని స్పష్టం చేశారు.
అర్హులకే ఇళ్లు దక్కాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు… అత్యంత పకడ్బందీగా ఎంపిక విధానాన్ని రూపొందించామని కేటీఆర్ అన్నారు. ఎక్కడైనా అనర్హులు జాబితాలో ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై ఉద్యోగం నుంచి తొలగించే స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇలాంటి రెండు పడక గదుల ఇళ్లు దేశంలో మరెక్కడా లేవని కేటీఆర్ పునరుద్ఘాటించారు.