తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందడి షురూ అయింది. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు కూడా రంగం సిద్ధం అయింది. ఉదయం ఐదు గంటల నుంచే స్ట్రాంగ్ రూముల వద్ద సందడి మొదలైంది.ఆ వెంటనే లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులకు విధుల కేటాయింపు జరిగింది. సరిగ్గా 8 గంటలకు ఈవీఎంలలోని ఓట్లల లెక్కింపు మొదలవనుంది. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎవరు, ఎంత మెజార్టీతో గెలిచారో మధ్యాహ్నం 3 గంటలకు తెలిసిపోతుంది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలవగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగగా.. బీజేపీ తరఫున వంశతిలక్ పోటీ పడ్డారు. 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.