ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

పుట్టినరోజు వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు భువనగిరి లోక్‌సభ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆయన…. గెలవకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అధికార బిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు.

వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ పూలమాలతో ఆయన్ను అభినందించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ హోరెత్తించారు. ర్యాలీ అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 70-80 సీట్లు ఖాయమని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ప్రజలు బిఆర్‌ఎస్‌ పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని తెలియజేశారు. ఇక్కడ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయేనని ఈ సారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తపరిచారు. కాంగ్రెస్‌ పార్టీ 70 సీట్లు సాధించలేకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. ఇప్పటికే కర్నాటకలో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే జోష్‌తో తెలంగాణలోనూ అధికారాన్ని సాధించే దిశగా ఆ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. ఘర్‌ వాపసీ పేరుతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో జరుగుతున్న అవినీతి,ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ మునుపటి కంటే పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌దేనంటూ ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు.

ఇదే క్రమంలో కోమటిరెడ్డి లాంటి సీనియర్‌ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు కార్యకర్తలకు మరింతగా బూస్టప్‌ ఇచ్చాయనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version