భద్రాచలం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.
భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో ఆరంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. కొంతకాలంగా అలాగే ఉన్న ఈ భవనం ఈరోజు మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భవనం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. శిథిలాలను ప్రొక్లెయిన్ సాయంతో తొలగిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.