కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత సరైన ప్రాధాన్యం దక్కలేదని.. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదని ఆరోపించారు సంతోష్ కుమార్. తన నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని.. నిజాయితీగా వున్నానని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి బరిలో ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించారు సంతోష్ కుమార్.
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ వైఖరి వల్లే తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఏదైనా ప్రధాన పార్టీ టిక్కెట్ దక్కితే ఆ పార్టీ నుంచి.. లేదా, ఇండిపెండెంట్ గానైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు సంతోష్ కుమార్. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వస్తే సన్నిహితులతో సమావేశం అయ్యి ఆ పార్టీలో చేరే విషయంపై ఆలోచిస్తానన్నారు. సంతోష్ వ్యాఖ్యలతో కరీంనగర్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.