చిన్నదో పెద్దదో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. దూరభారం తగ్గాలనో.. ఛార్జీ తక్కువగా ఉంటుందనో రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటూ ఉంటారు సామాన్యులు. కానీ ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు వారిని భయపెడుతున్నాయి.వారినే కాదు రైలు ప్రయాణం చేస్తున్న వారి కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తిరిగి వారు క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారో లేదోనని క్షణక్షణం భయపడుతూనే ఉంటున్నారు. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే ప్రాణనష్టం ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇవాళ ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ వద్ద ఉన్నట్టుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన లోకో పైలట్.. అప్రమత్తమై రైలును యాదాద్రి భువనగరి జిల్లాలోని బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. రైలు ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించారు. స్టేషన్‌లో అందుబాటులో ఉన్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. 20 నిమిషాల తర్వాత రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది.