తెలంగాణలోకి వచ్చే నెల (జూన్) 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నట్లు ఇప్పటికే ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుందని, అంటే 5-8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
కొంత ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్ 11వ తేదీన వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని పేర్కొంది.