స్టేజ్ కుప్పకూలి కాంగ్రెస్ మహిళా నేతకు గాయాలు

-

మహబూబాబాద్ జిల్లాలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కుప్పకూలడంతో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త హనుమాండ్ల ఝాన్సీ రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది.

తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఝాన్సీ రెడ్డి.. వేదిక పైకి ఎక్కి అభివాదం చేస్తుండగా వేదిక కుప్పకూలిపోయింది. వేదిక పైకి చాలామంది చేరుకోవడంతో బ్యాలెన్స్ అదుపుతప్పి కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆమె అనుచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె కాలికి తీవ్ర గాయం అయినట్లుగా సమాచారం.

దీంతో ఝాన్సీ రెడ్డికి జరిగిన ప్రమాదంపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఝాన్సీ రెడ్డి ప్రస్తుతం పాలకుర్తి కాంగ్రెస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పాలకుర్తి నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినప్పటికీ.. ఝాన్సీ భారత పౌరసత్వం పై వివాదం చెలరేగింది. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version