అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనే ఆమె జ్వరం బారిన పడ్డారు. దీంతో తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులగా మంత్రికి జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా డాక్టర్లు.. ఆమెకు డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నానని.. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.