సెప్టెంబరు మొదటి వారంలో చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మత్స్యశాఖ కార్యాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. దీంతో ఈ సంవత్సరం రూ.88.53 కోట్లు ఖర్చుచేసి 68 కోట్ల చేప పిల్లలను, రూ.24.50 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను అందజేయాలని నిర్ణయించామన్నారు. వీటిని సెప్టెంబరు మొదటి వారంలోగా పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పిల్లలను తిరస్కరించాలని, అయితే కారణాలను కమిషనర్ కార్యాలయానికి నివేదించాలని మంత్రి తలసాని చెప్పారు. చేప పిల్లల విడుదల కార్యక్రమాల్లో ప్రతీ జిల్లాలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులను భాగస్వాములను చేయాలని స్పష్టంచేశారు.