హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా నాలుగు రోజుల పాటు కురిసిన వానకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు నగరంలోని హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్న వరద నీటితో నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటమట్టం 513.53 మీటర్లు ఉంది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు.
ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని పరిశీలించారు. నాలాలు అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయని అన్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని.. అక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే వారికి పరిహారం కూడా ఇస్తామని వెల్లడించారు. మరో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.