తెలంగాణ ఏఈఈ అభ్యర్థులకు అలర్ట్. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించిన పరీక్ష మెరిట్ జాబితా త్వరలోనే వెలువడనుంది. సివిల్ పోస్టులకు సంబంధించి పరీక్ష మార్కులను మాత్రం నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు. ఈ నియామకాలకు సంబంధించి న్యాయవివాదం పరిష్కారమైన వారం, పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మెరిట్ జాబితా ప్రకటించిన నాలుగైదు రోజుల్లో తుది ఎంపిక ఫలితాలు ప్రకటించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 సెప్టెంబరులో ప్రకటన జారీ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 81,548 మంది దరఖాస్తు చేశారు. 2023 జనవరి 22న ఓఎంఆర్ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించింది. క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షను కమిషన్ రద్దు చేసింది. అనంతరం మే 8, 9, 21, 22 తేదీల్లో పునఃపరీక్షలు నిర్వహించింది. ఈసారి సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలను చేపట్టింది.