తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ స్పీకర్ ప్రసాద్ కుమార్అ ధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 9, 10, 12, 13వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శుక్రవారం (ఫిబ్రవరి 9వ తేదీన) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీ చర్చ జరగనుంది. 10వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈనెల 12, 13వ తేదీల్లో బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చించనున్నారు. మరోవైపు బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కడియం శ్రీహరి, అక్బరుద్దీన్ ఓవైసీ, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.