తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు రాష్ట్రంలోని 50 ప్రాంతాలను గుర్తించారు. అనుమతి కోసం ఆ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించగా.. ఈసీ ఇప్పటికే సూత్రప్రాయ అనుమతి ఇవ్వటంతో అధికారులు ఏర్పాట్లు షురూ చేశారు.
ఓట్ల లెక్కింపు కోసం మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తొలి అంచెలో సాయుధ కేంద్ర బలగాలు, ఆ తర్వాత రెండు దశల్లో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అత్యవసర పరిస్థితుల్లో మినహా భద్రతా బలగాలను లోపలికి అనుమతించకూడదని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని టేబుళ్లు వేయాలి? ఎన్ని రౌండ్లలో లెక్కింపు చేపట్టాలన్నది పోలింగు తర్వాత ఖరారు చేస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ప్రతి రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది పరిశీలకుడి అనుమతి తర్వాతే ప్రకటించాలని వెల్లడించారు. ప్రతి లెక్కింపు టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడిని(మైక్రో అబ్జర్వర్‌ను) నియమించాలని చెప్పారు. రౌండ్‌ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలను ఆయా కేంద్రాల బయట ఉన్న వారికి వెల్లడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.