తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక వసతులు కల్పించారు. దివ్యాంగుల కోసం 21,686 వీల్ ఛైర్లు.. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం.. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తున్నారు. 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు నిలవగా వారిలో.. 2068 మంది పురుషులు.. 221 మంది మహిళలు.. ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు.. కాంగ్రెస్ 118, ఒక స్థానంలో సీపీఐ.. 111 నియోజకవర్గాల్లో బీజేపీ, 8 స్థానాల్లో జనసేన.. బీఎస్పీ 108 .. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 48 మంది పోటీ చేస్తున్నారు.