తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆదివారం (6వ తేదీ) వరకు కొనసాగే అవకాశాలున్నాయి. తొలిరోజు గురువారం శాసనసభ ముగిసిన తర్వాత.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమైంది. మూడురోజులపాటు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగా.. చాలా సమస్యలున్నాయని, కనీసం 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది.
ఎన్ని పనిదినాలు నిర్వహించామన్న దాని కంటే.. ఎన్ని పనిగంటలు నిర్వహిస్తున్నామనేది పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పొడిగించాలనుకుంటే శనివారం నిర్ణయం తీసుకోవాలని బీఏసీ నిర్ణయించింది. ఇందులో ఉపసభాపతి పద్మారావు, ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మజ్లిస్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
శాసనమండలిలో నిర్వహించిన బీఏసీలోనూ ఇదే తరహాలో నిర్ణయించారు. మండలిలో తొలిరోజు గురువారం వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చ జరగ్గా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఇవాళ కూడా శాసనసభలో ఇదే అంశంపై చర్చ జరగనుంది.