ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అంశాల్లో పాదర్శకంగా వ్యవహరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల విలువలైన ఒప్పందాలపై హర్షం వ్యక్తం చేశారు. అయితే గత సంవత్సరం WEF సదస్సుల్లో హామీ ఇవ్వబడిన పెట్టుబడుల స్థితిని వివరించేలా శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను చాటుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
గత సంవత్సరం WEF సదస్సులో ప్రభుత్వం రూ.4800 కోట్ల పెట్టుబుడులు తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఆ ఒప్పందాల్లో ఎన్ని అమలు దశకు చేరుకున్నాయో ఇంతవరకు స్పష్టం చేయలేదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు, గణాంకాలు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత.. ఇప్పటికైనా వాస్తవాలను తెలియజాయాలి. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడుల హామీల ఇవ్వడమే సరిపోదు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలి. ఒప్పందాలు సాధారణంగా ప్రణాళికలకే పరిమితమయ్యాయి.