తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పుడు ఓవైపు ప్రచారంలో బిజీగా ఉంటూనే.. మరోవైపు మలిజాబితాపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఫోకస్ అంతా జనసేనతో పొత్తు.. సీట్ల పంపకంపై ఉంది. ఈ క్రమంలోనే మూడో జాబితాపై కాషాయదళం కసరత్తు ముమ్మరం చేసింది.
రాష్ట్రంలో 47 స్థానాలతో మూడో జాబితాను ఇవాళ విడుదల చేసేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే 53 స్థానాలకు ప్రకటించింది. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను మినహాయించి మిగతా స్థానాలకు ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలను జనసేనకు వదిలేయాలని ఈ బోర్డులో పాల్గొన్న అగ్రనేతలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా జనసేనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.