ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

-

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు దాదాపుగా ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండగా.. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలా? లేదా ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ ప్రవేశపెట్టాలా? అని ప్రభుత్వం చర్చిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ఫిబ్రవరి రెండో వారం తర్వాత విడుదల కావచ్చనే ప్రచారంతో.. ఆలోపే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news