తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ్టి సమావేశాల అనంతరం బడ్జెట్ డిన్నర్ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు ఈ ఇరువురు నేతలు ఢిల్లీ వెళ్లనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన డిన్నర్ వాయిదా పడినట్లు పేర్కొంది. అయితే ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర నేతల సమాచారం.
మరోవైపు ఇవాళ్టి సమావేశాల్లో పురపాలక సంక్షేమ పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పద్ధులపై చర్చ జరుగుతోంది. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై కూడా శాసనసభలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరపాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.