తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు బోధనలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యం కాపాడుతుందని తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు గవర్నర్, సీఎంలతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌లు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పారదర్శకంగా, ప్రజాస్వామికంగా పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ.. ఆనందోత్సాహాలతో క్రిస్మస్‌ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు అనుసరించిన మార్గంలో సమాజ అభివృద్ధికి అందరూ పాటుపడాలని కేసీఆర్‌లు ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ఏసు ప్రభువు ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. మానవీయ విలువలు మాయమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే ప్రారంభమైన ఈ వేడుకలు ఇవాళ అంబరాన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు కిటకిటలాడుతున్నాయి.