తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఇవాళ్టి నుంచి దావోస్లో పర్యటిస్తుంది. ఈరోజు నుంచి ఈనెల 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సును రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే వేదికగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర బృందం ఆ సదస్సుకు హాజరవుతోంది. ఈ పర్యటనలో సుమారు 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమై పెట్టుబడుల విషయం చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నొవర్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతనిధులను కలుస్తారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్లు, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ భేటీ కావడంతో పాటు సీఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో చర్చిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్ తో సీఎం బృందం సమావేశం కానుంది.