తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. రేవంత్‌తో పాటు కొద్ది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
రేవంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు తరలిరానున్నారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు, సీపీఐ నేత డి.రాజా, పలు రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, సిద్ధరామయ్య, స్టాలిన్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, జేఎంఎం నేత శిబూ సోరెన్, పీసీసీ చీఫ్‌లు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, 300 మంది అమరవీరుల కుటుంబాలు, మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పీసీసీ ఆహ్వానం పంపింది. మరికొన్ని గంటల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.