తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు తన గ్రాఫ్‌ను పెంచుకుంటోంది. పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తూ ప్రజలను ఆకర్షిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లిన హస్తం పార్టీ ఇక నుంచి అభయహస్తం మేనిఫెస్టోను ప్రజలకు వివరించే పనిలో పడింది. ఇందుకోసం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు కొత్తగా రాష్ట్ర ప్రచార, ప్లానింగ్ కమిటీని నియమించింది కాంగ్రెస్ పార్టీ.
15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అందులో తాజాగా చేరిన విజయశాంతికి కీలక బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా ఆమెను నియమించింది. ఇక కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించింది.