రుణాల మాఫీకి రూ.6,098 కోట్లు విడుదల.. నల్గొండ జిల్లాకు రూ.454 కోట్లు

-

పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా రూ.లక్షలోపు మాఫీకి తెలంగాణ ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు రూ.6,098.93 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454.49 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు రూ.లక్షలోపు రుణం మాఫీ అయినట్లు వెల్లడించారు. అతి తక్కువగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 2,667 కుటుంబాలకు చెందిన 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయినట్లు వివరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు రూ.50,370 మాఫీ అయ్యాయి.

జిల్లాలు, నియోజకవర్గాల వారీగా రైతు కుటుంబాల లబ్ధిదారులు, నిధులు జమ అయిన మొత్తాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రుణ మాఫీలో నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలు మొదటి 12 స్థానాల్లో నిలవగా.. నియోజకవర్గాల వారీగా చూస్తే అందోలు, హుస్నాబాద్, కల్వకుర్తి, దుబ్బాక, కొడంగల్, మునుగోడు, దేవరకొండ, తుంగతుర్తి, నారాయణఖేడ్, ధర్మపురి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news