దేశవ్యాప్తంగా ‘విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరులో తెలంగాణ సంస్థలు అట్టడుగున ఉన్నాయి. వివిధ విభాగాల్లో కనబరిచిన పనితీరు ఆధారంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ) ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోని రెండు సంస్థలకు ‘సి’ గ్రేడ్ లభించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కంకు 46, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కంకు 44వ ర్యాంకు దక్కింది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకునే డిస్కంలకు అప్పులు ఇస్తాయి.
మొత్తం 53 డిస్కంల పనితీరును జాతీయ స్థాయిలో మదింపు చేస్తే ముంబయి, దిల్లీ, గుజరాత్, ఒడిశా, హరియాణాకు చెందిన 14 సంస్థలకు మాత్రమే ‘ఏ ప్లస్’ గ్రేడ్ లభించింది. మరో 4 ‘ఏ’, 7 డిస్కంలకు ‘బి’, 13కి ‘బి మైనస్’, 11 సంస్థలకు సి, మిగిలిన వాటికి సీ మైనస్ ర్యాంకు వచ్చింది. తెలంగాణకన్నా వెనుకబడిన రాష్ట్రాలైన ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల డిస్కంలు సైతం ర్యాంకింగులో ఉన్నతస్థాయిలో ఉండటం గమనార్హం.