ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా EAPCET జరగనుంది. ఇవాళ్టి నుంచి 11 వరకు జరగనున్న పరీక్షల కోసం జేఎన్టీయూహెచ్ రంగం సిద్ధం చేసింది. ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మా, 9 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాల కోసం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 12 వరకు… తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 3.5 లక్షల మందికి పైగా నమోదు చేసుకోగా వారిలో 2.54 లక్షల మంది ఇంజినీరింగ్ విభాగానికి, లక్షా 200 మందికి పైగా ఇంజినీరింగ్ అండ్ ఫార్మా కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గతంతో పోలిస్తే ఈఏపీసెట్కి దాదాపు 50వేల వరకు దరఖాస్తులు అదనంగా వచ్చాయి. తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్నందున ఆ ప్రక్రియ పూర్తికాని విద్యార్థుల నుంచి స్వీయ ధ్రువీకరణ లేఖను తీసుకుని పరీక్షకు అనుమతించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి 21 జోన్లలో మొత్తం 300లకు పైగా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని జేఎన్టీయూహెచ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాటర్ బాటిళ్లు, వాచ్లు, సెల్ఫోన్లు, పేజర్స్, కాలిక్యులేటర్ల వంటి వాటని పరీక్షా కేంద్రం లోనికి అనుమతించబోమని తెలిపింది.