గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కూడా గవర్నర్‌కు సర్కార్ ఆహ్వానం పంపడం లేదు. మరోవైపు గవర్నర్ తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడంతో ఈ వివాదం కాస్త ఇంకా ముదిరింది. ఏకంగా సర్కార్ గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే తాజాగా తెలంగాణ నూతన పరిపాలనా సౌధం.. నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపలేదని కొందరు.. ఆహ్వానించినా రాలేదని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రాజ్ భవన్ తాజాగా స్పందించింది.
సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినప్పటికీ గవర్నర్ రాలేదన్న ఆరోపణలను రాజ్‌భవన్ తోసిపుచ్చింది. గవర్నర్ పై చేసిన ఆరోపణలు సత్యదూరం, అధారరహితమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేసింది. కేవలం ఆహ్వానం లేనందునే సచివాలయ ప్రారంభానికి గవర్నర్ రాలేదని రాజ్ భవన్ తెలిపింది