తెలంగాణలో గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. హెచ్ సీయూ పరిధిలో ఉన్న ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికే చెందుతాయంటూ ఇటీవల టీజీఐఐసీ ఇచ్చిన ప్రకటనతో ఈ వివాదం చెలరేగింది. ఇది కాస్తా ముదిరి కోర్టుల దాకా వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై స్పందించి ఈ భూములను సందర్శించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఏర్పాటు చేసింది.
మరోవైపు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసింది. ఈ భూములు అటవీ భూములు కావని.. 20 ఏళ్లుగా ఖాళీ ఉండటంతో పొదలు పెరిగాయని రేవంత్ సర్కార్ కోర్టుకు తెలిపింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవని.. కంచె ఏర్పాటు చేయడానికి మాత్రమే తాము ప్రయత్నించామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.