తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కేవలం తన కుటుంబాన్నే కాకుండా యావత్ తెలంగాణ కళాకారులను విషాదంలోకి నెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కళతో ఆయన చేసిన సేవలను ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది. సాయిచంద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసింది. సాయిచంద్ సతీమణి రజినికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుర్రంగూడలోని సాయిచంద్ ఇంటికి వెళ్లి ఈ చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్ అనిత రెడ్డి పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సాయిచంద్.. జూన్ 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.