యాదాద్రిపై సర్కార్ ఫోకస్.. కొండపైకి వ్యక్తిగత వాహనాల అనుమతిపై పునరాలోచన

-

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా తీసింది. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని యాడాను ఆదేశించింది. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధ్యయనం చేయించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వద్దకు ప్రతిపాదనలు అందాయి. ఈ క్రమంలో త్వరలో మంత్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ముఖ్యంగా కొండపైకి వ్యక్తిగత వాహనాల అనుమతిపై పునరాలోచన చేస్తున్నారు. కొండపైకి రూ.500 చెల్లిస్తే వ్యక్తిగత వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో వ్యక్తిగత వాహనాల రాక పెరిగే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో పార్కింగ్‌ సమస్య రావడంతోపాటు కొండపైన కాలుష్యం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో వ్యక్తిగత వాహనాలను ఇప్పటినుంచే నియంత్రించకపోతే రానున్న రోజుల్లో మరింత కష్టం అవుతుందని అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ విషయంపై కూడా అధికారులు అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news