కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో లోపాలపై మంత్రులు, అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టగా.. తాజాగా మొదటి లింకులో ఉన్న మూడు బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్‌లో పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా సమస్యలున్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు పేర్కొనడంతో మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పని చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థకు తుది బిల్లు సుమారు రూ.400 కోట్లు.. అన్నారం బ్యారేజీ పని చేసిన అప్కాన్స్ సంస్థకు రూ.161 కోట్ల తుది బిల్లు పెండింగ్‌లో ఉండగా.. సుందిళ్ల బ్యారేజీ పని చేసిన నవయుగకు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు అన్నారం పంపు హౌస్ 2022లో వరదలకు నీట మునిగిన తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కాంక్రీటు వాల్ నిర్మాణ పని చేపట్టిన మేఘా ఇంజినీరింగ్కు చెల్లించాల్సిన రూ.74 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మూడు బ్యారేజీలకు సంబంధించిన ఫైనల్ బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.