తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హమీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మి పథకం అమలు చేసిన ప్రభుత్వం త్వరలో మరిన్ని గ్యారంటీలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందే పథకం అమలుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది.
ఈ పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) తెలిపింది. అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా డిస్కం ఈ వివరణ ఇచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
ఇటీవల చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో ఈ పథకానికి 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిబంధనలను విడుదల చేశాక అర్హుల గుర్తింపుపై మరింత స్పష్టత వస్తుందని విద్యుత్ అధికారులు తెలిపారు.