తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన నేటి సమావేశంలో శాసనసభలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొదట ఇవాళ ఉదయం 9 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పద్దును ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు తీసుకోనున్నారు.
ఈ బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి రంగాలకే అధికంగా నిధులు కేటాయించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆరు గ్యారంటీ హామీల అమలుకు రూ.50 వేల కోట్లకు పైగా దక్కే అవకాశాలున్నట్లు తెలిసింది. మొత్తం బడ్జెట్ రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ పద్దు రూ.2.75 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక తాజా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించనందున దాని ప్రభావం రాష్ట్ర పద్దుపై పడనుంది.