తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసిన విషయం తెలిసిందే. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.
మరోవైపు ప్రిలిమ్స్‌ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్ నోట్ జారీ చేసింది. ఈ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్‌టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశముందని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. భారీగా 4.03 లక్షల దరఖాస్తులు రావడంతో.. సీబీఆర్‌టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసిన కమిషన్.. అందువల్ల ఒక్కరోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హాల్‌టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్లో తెలిపింది.