తెలంగాణ సంక్షేమ గురుకుల పీజీటీ ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 2,144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను విడుదల చేసింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌లు కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి, 1,276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులకు జాబితాలు విడుదల చేసింది.
మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించనున్నట్లు గురుకుల బోర్డు తెలిపింది. వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) మినహా మిగతా వాటి ఫలితాలు ప్రకటించనున్నట్లు చెప్పింది. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్/సెట్ స్కోరు తప్పనిసరి. ఇటీవలే సెట్ స్కోరు వివరాలు రాగా వాటిని అప్‌డేట్ చేసిన అనంతరం 1:2 నిష్పత్తిలో ఆ పోస్టుల తాలూకు మెరిట్ జాబితాను బోర్డు ప్రకటించనుంది.
ఫలితాల వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి ఓపెన్ చేయడంతో గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో బోర్డు వివరాలను గురుకుల సొసైటీల వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచింది.