బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది. దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఆయనకు రూ.50 వేల జరిమానా కూడా విధించింది.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విఠల్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది.