హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. ఈ వివాదం కాస్తా కోర్టులకు ఎక్కింది. ఇప్పటికే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో ఏప్రిల్ 2న వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే.
వాదనలు విన్న ధర్మాసనం.. ఒక్కరోజు పనులు ఆపాలని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేయగా.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ కోర్టును గడువు అడిగారు. ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. అప్పటివరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని జారీ చేసిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు తెలిపింది.