‘ఒకే రాష్ట్రం.. ఒకే సేవ’ నినాదంతో పని చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత, స్నేహపూర్వక పోలీసు సేవలను అందిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో రాష్ట్ర పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు.
హైదరాబాద్ గోషామహల్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా అమరులైన 264 మంది పోలీసులకు హోంమంత్రితో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. పటిష్ఠమైన శాంతిభద్రతల నిర్వహణకు అద్భుత, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ కలిగిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతోందన్నారు. నేరం చేస్తే శిక్ష తప్పించుకోలేని విధంగా చర్యలు తీసుకుంటున్నామని.. పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీసుశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని డీజీపీ వివరించారు.