తిరుమల తొక్కిసలాట ఘటనలో ఈవో, అడిషనల్ ఈవో, పోలీస్ అధికారులు తొక్కిసలాట ఘటన పై బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీ, అడిషనల్ ఈవో మధ్య గ్యాప్ ఉందని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కుట్ర జరిగిందా..? అని అనుమానం ఉంది. టీటీడీ వీఐపీలకు మాత్రమే కాదు.. సామాన్యులకు కూడా సేవ చేయాలన్నారు.
ఇంత మంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారు. దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులను గంటలు గంటలు క్యూలలో వేచి ఉంచుతున్నారు. తొక్కిసలాట ఘటన కచ్చితంగా నిర్వహణ వైఫల్యమే అన్నారు. క్రౌడ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో ఖాకీలు ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈరోజు తాను వచ్చిన సమయంలోనూ ఇది నిరూపితం అయిందన్నారు. నిన్నటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు టీటీడీ, పోలీసులు వెళ్లి క్షమాపణ చెప్పాలని సీఎంకు సూచిస్తానన్నారు.