కాంగ్రెస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అతి త్వరలో తెలంగాణ కూడా శ్రీలంకలా మారబోతుందని జోష్యం చెప్పారు.
ఎఫ్ఆర్ఎంబి పరిధి దాటి ఏడాదిలోనే రూ. 1 లక్ష 27 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేవలం కమిషన్ల కోసమే రేవంత్ సర్కార్ పనిచేస్తుందని విమర్శలు గుప్పించారు.
అంతకుముందు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 1 లక్ష 27 వేల కోట్లు అప్పు తీసుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 64 కోట్లు అప్పు తీసుకున్నామని విభిన్నమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భూములను అమ్మి అప్పులు చేస్తున్నారని, కంచ గచ్చిబౌలి భూములు 400 ఎకరాలను టీజీఐసీకి బదిలీ చేశారని ఆరోపించారు.