తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. మంగళవారం రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవగా, ఇవాళ్టి నుంచి శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. నిన్న అసెంబ్లీ అటు మండలి బీఏసీ సమావేశాలు నిర్వహించి నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ రెండో రోజున రాష్ట్రంలోని వివిధ అంశాలపై మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది.
శాసన సభలో ప్రశ్నలు అడిగేందుకు మొత్తం పది ప్రశ్నలకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఆయా శాఖలకు ఈ ప్రశ్నలను పంపించి సంబంధిత శాఖల మంత్రులు సమాచారం తెప్పించుకున్నారు. ప్రధానంగా పాఠశాలల, కళాశాలల బస్సుల ఫిట్‌నెస్‌తనిఖీ, తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలు, నిజామాబాద్ పట్టణ అసెంబ్లీ నియోజక వర్గ ంలో క్రీడా సముదాయం, తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఐటీ ఏర్పాటు, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపు, రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు, జాతీయ రహదారి విస్తరణ పనులు, మూసీనదికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం తదితర అంశాలపై శాసన సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానాలు ఇస్తారు.