రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా నూతన పర్యాటక విధానాన్ని తీసుకువచ్చామన్నారు.
ఈ క్రమంలోనే గుజరాత్‌లోని సత్పురా, వింధ్యాంచల్ పర్వత శ్రేణుల్లోని నర్మదా నది తీరంలో ఉన్న సర్దార్ వల్లబాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని, టెంట్ సిటీని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి వీక్షించారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా దేశీయ,అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని.. అందులో భాగంగానే ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’, టెంట్ సిటీని సందర్శించినట్లు వెల్లడించారు.