సహజంగా కాంతివంతమైన చర్మాన్ని పొందాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి . కానీ వేసవికాలంలో ఎంత ప్రయత్నించినా సూర్యకిరణాల ప్రభావం వల్ల చర్మం కాంతిహీనంగా మారుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన చెమటలు కూడా ఎక్కువగా పడతాయి, దీని కారణంగా చర్మం పై మరింత ప్రభావం పడుతుంది. కనుక తాత్కాలిక ప్రయోజనం కోసం కెమికల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకుండా ఈ సహజ చిట్కాలను పాటించండి. సహజ పదార్థాలతో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా చర్మ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నా ప్రతిరోజు రెండు సార్లు ఫేస్ వాష్ చేయడం ఎంతో అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో క్లెన్సర్స్ ను ఉపయోగించి రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ బయటకు వెళ్తే తప్పకుండా సన్ స్క్రీన్ ను ఉపయోగించండి. ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ఉపయోగిస్తే, హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ఎండ ప్రభావం వల్ల చర్మం కమిలిపోయినట్లయితే, తప్పకుండా మాయిశ్చరైజర్ లోషన్ లేదా అలొవెరా జెల్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై దురద, ఎలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఎండాకాలంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, గింజలు వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యం బాగుంటుంది. చర్మం కమిలిపోయినప్పుడు పసుపు మరియు ముల్తానీ మట్టిని కలిపి ఫేస్ ప్యాక్ వేయడం వల్ల చర్మానికి చల్లదనాన్ని అందించవచ్చు. వేసవికాలంలో కీరదోసకాయ పేస్ట్ ను ముఖానికి ఉపయోగించడం వలన చర్మం పై మంట, దురద వంటివి తగ్గుతాయి. కనుక వేసవికాలంలో ఈ చిట్కాలను పాటించి మీ చర్మాన్ని కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా మార్చుకోండి.