ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అంతా ఊహించిందే జరిగింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం దిల్లీలో ప్రకటించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
మరోవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను కోరారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలని చెప్పారు. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు, ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ ఎంసీ అధికారులను కోరారు. ఎల్బీస్టేడియం వద్దకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.