సమాచార కమిషనర్ల(ఆర్టీఐ) నియామకాల్లో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌పై హైకోర్టు ఇవాళ విచారణను చేపట్టింది. విచారణలో భాగంగా ఏజీ ప్రసాద్ ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌కు ఆగస్టు 4 వరకు గడువు ఉందని వివరించారు.
సమాచార కమిషన్, హెచ్‌ఆర్‌సీ వంటివి ఖాళీగా ఎందుకు పెడుతున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. సమాచార కమిషనర్లు లేని పరిస్థితే తలెత్తవద్దని స్పష్టం చేసింది. ఈ నియామకంపై విచారణను ఆగస్టు 23కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
మరోవైపు మియాపూర్‌లోని సీఆర్పీఎఫ్ భూమిలో ఉంటున్న నివాసితులకు అంతరాయం కలిగించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మియాపూర్‌లోని 40 ఎకరాల సీఆర్పీఎఫ్ భూమిలో.. పేదలు 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ మేరకు వెంటనే ఖాళీ చేయాలని.. నివాసితులకు ప్రభుత్వాలు తెలిపాయి. దీనిపై ఈ భూములలో పేదలను ఖాళీ చేయించవద్దని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.